Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 57

Viswamitra becomes Rajarshi !!

|| om tat sat ||

తతః సంతప్తహృదయః స్మరన్ నిగ్రహమాత్మనః |
వినిశ్శ్వస్య వినిశ్శ్వస్య కృతవైరో మహాత్మనా ||

తా|| అప్పుడు మహాత్మునితో వైరము చేసినవాడై (జరిగిన పరాభమునకు) తనను తాను నిగ్రహించుకొని పదే పదే నిట్టూచుచూ పరితపించెను.

బాలకాండ
ఏబది ఏడవ సర్గము
విశ్వామిత్రుడు రాజర్షి అగుట

శతానందుడు విశ్వామిత్రుని కథ కొనసాగించెను.

" ఓ రాఘవా ! అప్పుడు వసిష్ఠునితో వైరమును పొందిన విశ్వామిత్రుడు, జరిగిన పరాభవమునకు చింతించుచూ తనను తాను నిగ్రహించుకొని పదే పదే నిట్టూచుచూ పరితపించెను. అప్పుడు తన పట్టపురాణితో దక్షిణ దిశగావెళ్ళి ఫలమూలములే ఆహారముగా తీసుకొని ఘోరమైన గొప్ప తపస్సును చేసెను. అచట ఆయనకు హవిష్యంద ,మధుష్యంద,ధృఢనేత్ర, మహారథ అనబడు సత్య ధర్మ పరాయణులగు పుత్రులు కలిగిరి. ఒక వేయి సంవత్సరములు పూర్తి అయిన పిమ్మట లోక పితామహుడగు బ్రహ్మ తపోధనుడగు విశ్వామిత్రునితో మధురమైన వాక్యములను పలికెను. "ఓ కుశికాత్మజ ! ఓ రాజర్షి ! నీ తపస్సుతో లోకములను జయిచితివి. నీవు ఈ తపస్సుతో రాజర్షి అని గుర్తింపబడెదవు" అని. అట్లు చెప్పి మహాతేజోవంతుడు లోకములకు పరమేశ్వరుడు అగు బ్రహ్మ దేవతలతో సహా తమ తమ లోకములకు పోయిరి .

’ "రాజర్షి" అన్న మాటను విని విశ్వామిత్రుడు కించపడి తల వంచుకొని దుఃఖముతో ఇట్లు తలిచెను. "మహత్తరమైన తపస్సు చేయబడినది. కాని దేవతలు ఋషులు నన్ను రాజర్షి అనియే తలచెదరు. నాకు తపస్సు యొక్క ఫలము దక్కలేదని భావింతును" అని. ఓ కాకుత్‍స్థ ! ఆ మహాతపోనిథి ఇట్లు ఆలోచించి పరమాత్మను మనస్సుతో మరల గొప్ప తపస్సు చేయసాగెను’.

అదే కాలములో త్రిశంకుడు అని ఖ్యాతి పొందిన వాడు , సత్యవాది , జితేంద్రియుడు ఇక్ష్వాకు కులమును వర్ధింపచేయువాడు అగు రాజు ఉండెను. ఓ రాఘవ! ఆ రాజుకు స్వర్గమునకు తన శరీరముతో వెళ్ళుటకు యజ్ఞము చేయవలె నని బుద్ధి పుట్టెను. అతడు వసిష్ఠుని కలిసి తన కోరిక వెళ్ళడించెను. మహాత్ముడైన వసిష్ఠుడు అది అశక్తము అని చెప్పెను. వసిష్ఠునిచే నిరాకరింపబడిన వాడై అతడు దక్షిణ దిశలో వెళ్ళెను. అప్పుడు ఆ త్రిశంకు మహరాజు తన కోరిక తీర్చుకొనుటకై మహాతేజోవంతులైన దీర్ఘకాలముగా తపస్సు చేయుచున్న వసిష్ఠునియొక్క వంద మంది పుత్రులు ఎచట కలరో అచటికి పోయెను.

ఆ యశోవంతుడు తపస్సు చేయుచున్న అందరు గురుపుత్రులను చూచెను. ఆ మహానుభావులందరికీ నమస్కరించి కొంచెము కించపడుతూ తలవంచుకొని అంజలి ఘటించి ఇట్లు పలికెను. "శరణు ఇవ్వగల మిమ్ములను నేను శరణు కోరుచున్నాను. మీకు భద్రమగుగాక . మహత్ముడగు వసిష్ఠుని చే నిరాకరింపబడితిని. శరీరముతో స్వర్గము పోవుటకు మహాయజ్ఞము చేయుటకు కోరిక గలవాడిని. దానికి మీ అనుజ్ఞ కోరుచున్నాను. గురుపుత్రులందరికీ నమస్కరించి మీ ప్రసాదము కోరుచున్నాను. తపస్సు చేయుచున్న బ్రహ్మ జ్ఞానము కల మీ అందరికీ శిరస్సుతో నమస్కరించుచున్నాను. ఇక్కడ సమాహితులైన మీరు నాకోరిక తీర్చుటకు యజ్ఞము జరిపించుదురుగాక".

" వసిష్ఠునిచేత నిరాకరింపబడితిని . గురుపుత్రులగు మీరు అందరు తప్ప ఇంకోమార్గము నాకు కనుపడుటలేదు . ఇక్ష్వాకులందరికీ పురోహితుడైన వశిష్ఠుడే మార్గము . పురోహితులు విద్వాంసులు ఎల్లప్పుడు రాజులను ఆదుకొంటారు. ఆ వసిష్ఠుని తరువాత మీరే నాకు దైవము".

||ఓమ్ తత్ సత్||

పురోధసస్తు విద్వాంసః తారయంతి సదా నృపాన్ |
తస్మాదనంతరం సర్వే భవంతో దైవతం మమ ||

తా|| పురోహితులు విద్వాంసులు ఎల్లప్పుడు రాజులను ఆదుకొంటారు. ఆ వసిష్ఠుని తరువాత మీరే నాకు దైవము ||

|| om tat sat ||